అంతా మన మంచికేనా? గీతాచార్యుడు చెప్పిన ‘కర్మ’ రహస్యం.. టెన్షన్స్ వీడే సింపుల్ సూత్రం!

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ఏకైక సమస్య ‘ఆందోళన’ (Anxiety). రేపు ఏం జరుగుతుందో, మన అనుకున్న పనులు అవుతాయో లేదో అనే భయం మనుషుల్లో ప్రశాంతతను దూరం చేస్తోంది. సరిగ్గా ఇలాంటి గందరగోళంలో ఉన్నప్పుడే.. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పిన ఒకే ఒక్క శ్లోకం మన మనసును ప్రశాంతత వైపు నడిపిస్తుంది.
“కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన” (నీ పనిని నువ్వు పర్ఫెక్ట్గా చేయడం వరకే నీ చేతుల్లో ఉంది.. దాని ఫలితం ఎలా ఉండాలనేది ప్రకృతి లేదా భగవంతుడి నిర్ణయం).
అసలైన ఆధ్యాత్మిక మ్యాజిక్ ఎక్కడుంది?
చాలామంది అనుకుంటారు.. ఆధ్యాత్మికత అంటే కేవలం గుడులు తిరగడం, పూజలు చేయడం మాత్రమేనని. కానీ నిజమైన ఆధ్యాత్మికత అంటే.. “మన ప్రయత్నంలో లోపం లేకుండా కష్టపడి, ఆ తర్వాత వచ్చే ఫలితాన్ని దైవేచ్ఛగా భావించి మనస్ఫూర్తిగా స్వీకరించడం”.
జీవితంలో మనకు కొన్నిసార్లు మనం కోరుకున్నది దక్కదు. ఆ సమయంలో మనం ఎంతో కుంగిపోతాం. కానీ, కొన్ని రోజుల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే.. “అబ్బా! అప్పుడు ఆ రోజు అది జరగకపోవడమే మంచిదైంది, లేదంటే నా లైఫ్ ఇంకోలా ఉండేది” అనిపిస్తుంది. దాన్నే పెద్దలు “భగవంతుడి సంకల్పం” అంటారు. మనకు ఏది అవసరమో, ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆ సృష్టికి బాగా తెలుసు.
లవ్ గురు ఆధ్యాత్మిక పంచ్: బాసూ.. నువ్వు అనుకున్నది జరిగితే అది నీ అదృష్టం, అనుకున్నది జరగకపోతే అది భగవంతుడి ప్లాన్! ఎందుకంటే నీ ప్లాన్ కంటే ఆయన వేసే స్కెచ్ ఎప్పుడూ పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి, ఫలితం గురించి టెన్షన్లు పక్కన పెట్టి, ఈ రోజు నీ ముందున్న పనిని సంతోషంగా పూర్తి చేయ్. ప్రశాంతత నీ వెంటే వస్తుంది!